Monday 28 July 2008

ముద్దుగారే యశోద

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు. //2//

1.అంత నింత గొల్లెతల అరచేతి మాణికము - పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస - చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు. -- ముద్దు --

2. రతికేళి రుక్మిణికి రగుమోవి పగడము - మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖచక్రాల సందుల వైఢూర్యము - గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు -- ముద్దు --

3. కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము - యేలేటి శ్రీవేంకటాద్రి ఇంద్రనీలము
పాలజలనిధిలోన బాయని దివ్య రత్నము - బాలుని వలే దిరిగీ బద్మనాధుడు --ముద్దు --


భావము :

రత్నాల గుణాలన్నీ రాశిపోసి రాజీవాక్షుని అన్నమయ్య అనంతభావనాబలంతో ఉల్లేఖించిన పాట ఇది.

కృష్ణుడు దేవకీదేవి కన్న బిడ్డే కాదు. యశోద కన్న బిడ్డ కూడా. గోపాలుడు ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డడు. అందుకే ఒకరికి ముంగిట ముత్యమై, మరోకరికి తిద్దరాని మహిమల వాడైనాడు.

కృష్ణుడు - గొల్లభామలకు అరచేతి మాణిక్యము. అందరికీ అందుబాటులో ఉండేవాడు. కంసునిపాలిటి వజ్రము - దుష్ట శికషకుడు. గరుడుని ఎక్కి సకలలోకాలు సంచరించే సర్వాంతర్యామి - గరుడ పచ్చ పూస.

మాచెంతలో మాలోనే ఉన్నవాడు చిన్ని కృష్ణుడు. ముఖానికి మోవి ప్రధానం ; ఇది రతికేళి విషయం. అందుకే రుక్మిణికి రంగుమోవి పగడమైనాడు. గోవర్ధనగిరి జగద్రక్షకుడు. జగత్పతి గోమేధికం కావడంలో ఆస్చర్యం లేదు. ఇరు కేల శంఖ చక్రాలు ధరించినాడు ; వాని మధ్య వైఢూర్య కాంతులతో ప్రకాశించే దేవుడు వైడూర్యమే. తన కరుణాకటాక్షాలతో సకల ప్రాణికోటిని కాపడే స్వామి కమలాక్షుడే.

కాళింగుని పడగలపై చిందులు త్రొక్కిన చతుర నటమూర్తి పుష్యరాగమే. శ్రీవేంకటాద్రి వెలసిన వేంకటేశ్వరుడు ఘనశ్యాముడు ఇంద్రనీలం కాక మరేమి ? పాలకడలి లో పవ్వళించిన శేషశాయి రత్నమే ; రత్నాకరంలో పుట్టని దివ్య రత్నం. బ్రహ్మదేవుని కన్నతండ్రి పద్మనాభుడు బాలుని వలే పారాడినాడు.


తిద్దరాని మహిమలు = వంకపెట్టడానికి వీలులేని మహిమలు

ఇరుకేల = ఇరు చేతుల్లోనూ

ఏలేటి శ్రీవేంకటాద్రి = శ్రీవేంకశైలంలో నిలచి సకలచరాచర సృష్టిని ఏలేటివాడు - శ్రీవేంకటేశ్వరుడే.



ఈ పాటలో ఉన్న నవరత్నాల ప్రసక్తి - ముత్యం, వజ్రం, పగడం, గోమేధికం, వైడూర్యం, పుష్యరాగం, ఇంద్రనీలం, మాణిక్యం (పద్మరాగం/కెంపు), గరుడపచ్చపూస (మరకతం).


Listen to the song here.

Sunday 27 July 2008

భావము లోనా బాహ్యమునందును

భావము లోనా బాహ్యమునందును - గోవింద గోవింద యని కొలువవో మనసా

1. హరి నామములే అన్ని మంత్రములు! హరి లోనివే బ్రహ్మాండంబులు
హరినామములే అన్ని మంత్రములు - హరి హరి హరి హరి హరి హరి యనవో మనసా

2. విష్ణుని మహిమలే - విహిత కర్మములు ! విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడే - విశ్వాంతరాత్ముడు ! విష్ణువు విష్ణువని - వెదకవో మనసా

3. అచ్యుతిడితడే - ఆదియు నంత్యము ! అచ్యుతుడే - యసురాంతకుడు
అచ్యుతుడు శ్రీ వేంకటాద్రిమీద నిదె ! అచ్యుత యచ్యుత శరణనవో మనసా


భావము :

మనస్సు అంతరంగం. మాట బహిరంగం. ఒకటి బావం, మరొకటి బాహ్యం. మనసు, మాట, చేష్ట ఏకముఖంగా సాగినప్పుడే త్రికరణ శుద్ధి. ఓ మనసా ! గోవిందుని త్రికరణ శుద్ధి తో సేవించు.

హరినామస్మరణం సకల పాపహరం. దేవతలందరూ హరి అవతారాలే. బ్రహ్మాండాలనీ దామోదరుని ఉదరంలోనివే. హరినామాలే సకల మంత్రాలు. ఓ మనసా ! హరిని స్మరించు.

విష్ణువు విశ్వ వ్యాపకుడు. విష్ణుమహిమలను అభి వర్ణించేవే విహిత కార్యాలు. విష్ణువును పొగిడేవే వేదాలు. విశ్వాంతరాత్ముడైనవాడు విష్ణువు ఒక్కడే. ఓ మనసా ! విష్ణువును వెదుకు.

అచ్యుతుడు చ్యుతి* లేనివాడు. ఆద్యంతాలలో స్థిరంగా భాసించే వాడు. అసురులను అంతం చేసినవాడు అచ్యుతుడే. శ్రీ వేంకటగిరి శిఖరాలలో వెలసినదీతడే. ఓ మనసా ! అచ్యుతునే శరణు వేడు.



* చ్యుతి అన్న పదానికి నాకూ సరైన అర్ధం తెలియదు.

Friday 25 July 2008

శిరుత నవ్వుల వాడు శిన్నెకా

శిరుత నవ్వుల వాడు శిన్నెకా వీడు
వెరుపెరుగడు సూడవే శిన్నెకా

పొలసు మేనివాడు బోరవీపువాడు
సెలసుమోరవాడు శిన్నెక
గొలుసుల వంకల కోరలతో భూమి
వెలసినాడు సూడవే శిన్నెక .. శిరుత నవ్వుల వాడు ..


మేటి కురచవాడు మెడమీది గొడ్డలి
సీటకాల వాడు శిన్నెక
ఆటదాని బాసి అడవిలో రాకాసి
వేటలాడీ సూడవే శిన్నెక .. శిరుత నవ్వుల వాడు ..


బింకపుమోతల పిల్లంగోవి వాడు
సింక సూపులవాడు శిన్నెక
కొంకక కలికియై కొసరిగూడెనన్ను
వేంకటేసుడు సూడవే శిన్నెకా .. శిరుత నవ్వుల వాడు ..



** వినండి.

Saturday 19 July 2008

చక్కని తల్లికి ఛాంగుభళా

చక్కని తల్లికి ఛాంగుభళా తన
చక్కెర మోవికి ఛాంగుభళా

కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు చూపులకు ఛాంగుభళా
పలుకుల సొలపుల పతితో కసరెడి
చలముల యలుకకు ఛాంగుభళా


కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెరుగులకు ఛాంగుభళా
ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి ఛాంగుభళా


జందెపు ముత్యపు సరుల హారముల
చందనగంధికి ఛాంగుభళా
విందయి వేంకటవిభు పెనచిన తన
సందిదండలకు ఛాంగుభళా

Listen to this Song here

నగవులు నిజమని నమ్మేదా

నగవులు నిజమని నమ్మేదా
వొగి నడియాసలు వొద్దనవే

తొల్లిటి కర్మము దొంతుల నుండగ
చెల్లబో ఇక చేసేదా
యెల్లలోకములు యేలేటి దేవుడా
వొల్లనొల్ల నిక వొద్దనవే

పోయిన జన్మము పొరుగుల నుండగ
ఛీయనక యిందు చెలగేదా
వేయినామముల వెన్నుడమాయలు
వొయయ్య ఇక వొద్దనవే

నలినీ నామము నాలికనుండగ
తలకొని ఇతరము తడవేదా
బలు శ్రీవేంకటపతి నిన్ను గొలిచి
వొలుకు చెంచలము లొద్దనవే


Listen to this Song Here.

Friday 18 July 2008

వినరో భాగ్యము

వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణుకథ


ఆదినుండి సంద్యాది విధులలో
వేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచే
వీధి వీధులనే విష్ణుకథ


వదలక వేద వ్యాసులు నుడివిన
విదిత పావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్తనయై
వెదకిన చోటనే విష్ణుకథ


గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
వెల్లి విరియాయె విష్ణుకథ
ఇల్లిదె శ్రీ వేంకటేశ్వరు నామము
వెల్లిగొలిపె నీ విష్ణుకథ

సందెకాడ బుట్టినట్టి చాయల పంట

సందెకాడ బుట్టినట్టి చాయల పంట యెంత -
చందమాయ చూడరమ్మ చందమామ పంట


మునుప పాలవెల్లి మొలచి పండినపంట
నినుపై దేవతలకు నిచ్చ పంట
గొనకొని హరికన్ను గొనచూపుల పంట
వినువీధి నెగడిన వెన్నెలల పంట


వలరాజు పంపున వలపు విత్తిన పంట
చలువై పున్నమనాటి జానర పంట
కలిమి కామిని తోడ కారుకమ్మినపంట
మలయుచు తమలోని మర్రిమాని పంట


విరహుల గుండెలకు వెక్కసమైన పంట
పరగచుక్కలరాసి భాగ్యము పంట
అరుదై తూరుపుకొండ నారగబండినపంట
యిరవై శ్రీ వేంకటేశు నింటిలోని పంట

చందమామ రావో

చందమామ రావో జాబిల్లి రావో
కుందనపు పైడి కోర విన్న పాలు తేవో


నగు మోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి
నిగమములందుండే అప్పకు నా నీలవర్ణునికి
జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి

తెలిదెమ్మి కన్నుల మేటికి మంచి తియ్యని మాటల గుమ్మకు
కలికి చేతల కోడెకు మా కతలకారి ఈ బిడ్డకు
కులముద్ధరించిన పట్టె కు మంచి గుణములు కలిగిన కోడె కు
నిలువెల్ల నిండవొయ్యరికి నవనిధుల చూపుల చూచే సుగుణునకు


సురల గాచిన దేవరకు చుంచు గరుడునెక్కిన గబ్బికి
నెరవాది బుద్ధుల పెద్దకు మా నీటు చేతల పట్టికి
విరుల వింటి వాని అయ్యకు వేవేలురూపుల స్వామికి
సిరమించు నెరవాది జాణకు మా శ్రీవేంకటనాధునికి

Monday 7 July 2008

రామచంద్రులు నాపై చలము సేసినారు

రామచంద్రులు నాపై చలము చేసినారు సీతమ్మ చెప్పవమ్మ
కటకటా వినడేమి సేయుదు
కఠిన చిత్తుని మనసు కరుగదు
కర్మములు నెటులుండునోగద
ధర్మమే నీకుండునమ్మ

1. దిన దినము మీ చుట్టు దీనతతో దిరుగక
దిక్కెవ్వరికనోయమ్మ
దీనపోషకుడనుచు వేడితి దిక్కులన్నీ ప్రకటమాయెను
ఒక్కమాటైనను వినడు ఎక్కువేమని తలతునమ్మ

2. కౌసల్యతనయుడు కపటము చేసినాడు
కారణమిటుండెను కన్నడచేసెదవా
నీ కన్నుల వైభవంబు విన్నవింపగదమ్మ
నీ కన్న దిక్కెవ్వరోయమ్మ


3. దశరాధత్ముజుడెంతో దయశాలి యనుకొంటి
ధర్మహీనుడేయమ్మ
దానజనులకు దాతయతడట
రవికులాంబుధి సోముడితడట

చేరి యశోదకు శిశువితడు

చేరి యశోదకు శిశువితడు
ధారుణి బ్రహ్మ కు తండ్రియు నితడు


సొలసి చూచినను సూర్య చందృలను
లలి వెద చల్లెడు లక్షణుడు
నిలిచిన నిలువున నిఖిల దేవతల
కలిగించు సురల గనివో ఇతడు


మాటలాడినను మరియజాండములు
కోటుల వొడమెటి గుణరాశి
నీటగు నూర్పుల నిఖిల వేదములు
చాటున నూరెటి సముద్రమితడు


ముంగిట బొలసిన మోహనమాత్మల
బొంగించే ఘన పురుషుడు
సంగతి మా వంటి శరణాగతులకు
సంగము శ్రీ వేంకటాధిపుడితడు

నారాయణతే నమో నమో

నారాయణతే నమో నమో

నారద సన్నుత నమో నమో

౧) మురహర భవహర ముకుందా మాధవ

గరుడగమన పంకజనాభ

పరమ పురుష భవబంధ విమోచన

నారా మృగ శరీర నమో నమో

౨) జలధి శయన రవిచంద్ర విలోచన

జలరుహ భవనుత చరణయుగ

బలబంధన గోప వధూవల్లభ

నలినో దరతే నమో నమో

౩) ఆది దేవ సకలాగమ పూజిత

యాదవకుల మోహన రూప

వేదోద్దర శ్రీ వేంకట నాయక

నాద ప్రియతే నమో నమో

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger