Sunday 31 August 2008

మేలుకో శృంగార రాయ

మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవె నా పాలి మించిన నిధానమా

1. సందడించే గోపికల జవ్వన వనములోన
కందువ దిరిగే మదగజమవు
ఇందుముఖి సత్యభామ హృదయపద్మములోని
గంధము మరిగినట్టి గండు తుమ్మెద

2. గతికూడి రుక్మిణి కౌగిటి పంజరములో
రతి ముద్దుగులికేటి రాచిలుకా !
సతులు పదారువేల జంట కన్ను కలువలకు
ఇతవై పొడిమిన నా ఇందు బింబమా

3. వరుస కొలనిలోని వారి చన్ను కొండలపై
నిరతి వాలిన నా నీల మేఘమా
సిరినురమున మోచి శ్రీ వేంకటాద్రి మీద
గరిమ వరాలిచ్చే కల్ప తరువా


కీర్తన వినండి.. Pl open the link in a new Tab.

Saturday 30 August 2008

సువ్వి సువ్వి

సువ్వి సువ్వి సువ్వని సుదతులు దంచెద రోలాల

1. వనితలు మనసులు కుందెన చేసిటు వలపులు తగనించోరాలాల
కనుచూపులనిడు రోకండ్లను కన్నెలు దంచెద రోలాల

2. బంగరు చెఱగుల పట్టు పుట్టములు కొంగులు దూలగ నోలాల
అంగనలందరు నతివేడుకతో సంగడి దంచెద రోలాల

3. కురులు దూలగ మచి గుబ్బచనులపై సరులు దూలాడగ నోలాల
అరవిరి బాగుల నతివలు ముద్దులు గురియుచు దంచెద రోఅలాల

4. ఘల్లు ఘల్లుమను కంకణరవముల పల్లవపాణుల నోలాల
అల్లన నడుములు అసియాడుచు సతు లొల్లనె దంచెద రోలాల

5. కప్పురగంధులు కమ్మనిపువ్వుల చప్పరములలో నోలాల
తెప్పలుగా రతి దేలుచు గోనే టప్పనిబాడెద రోలాల


భావము :

కన్నెలు తమజవ్వ్వనమునే వేంకటేశ్వరునకు కప్పముగా చెల్లించినారు. హరిస్మరణ ఆ హరిణేక్షణల దైనందిన జీవితమైనది. పాలు పిదికినా, పెరుగు చిలికినా, బియ్యము దంచినా, చెరగినా - కోనేటప్పని గురించి పాడుటే వారికి పరిపాటైనది.

ఇది దంపుళ్ళ పాట. శ్రీనివాస కళ్యాణమునకు తలంబ్రాలు తయారు చేయుచున్నారు కాబోలు. యౌవనవతులు సింగారములు ఒలకబోయుచు దంపుళ్ళను ప్రారంభించినారు. ఈ టపాలో అన్నమయ్య మాటలమల్లె పందిళ్ళు కప్పినాడు. శబ్ధాలతో వర్ణచిత్రాలు గీచినాడు.

వనితలు 'సువ్వి ' , 'సువ్వి ' అనే ఊర్పులతో పని ప్రారంబించినారు. పాట మొదలు పెట్టినారు. కన్నెలు తమ మనసులనే కుదురులుగా నిలిపినారు. కనుచూపులనే రోకండ్లతో దంపుళ్ళు సాగించినారు. అంతా పాకములో పడినపుడు కోనేటప్పను తమ కొంగులలో ముడివేసుకొనవచ్చు నని తలపు కాబోలు.


దంపుళ్ళు సాగుతూనే ఉన్నవి. అంగనలు బగరుచెరగుల పట్టుచీరలను కట్టినారు. పైటకొంగులు ఊగిసలాడినవి. గుంపులుగ దంపుళ్ళలో తగిలిన మగువల విలాసములు గుంపులు కట్టి వేడుక లొలకబోసినవి.

వారి కురులు వీడినవి. చనుగుబ్బలపై సరులు నాట్యము లాడినవి. అరవిరి సొబగులతో ముద్దుగుమ్మలు ముద్దులు కురిపించినారు.

ఆ పల్లవపాణుల పాణికంకణములు ఘల్లుఘల్లుమనినవి. బరువులు మోయలేక, శ్రమకు తాళలేక ఆ హరిమధ్యల నడుములు అసియాడినవి. అబలలు మెలమెల్లగ దంపుళ్ళను ముగించినారు.



కన్నెల శ్రమ ఫలించినది. ఆ కప్పురగంధుల ఒడలి బడలికలు పూలపందిళ్ళ క్రింద తీరినవి. చలువ చప్పర్ముల క్రింద రతి పారవశ్యముతో కోనేటప్పని పాడుతూ తెప్పల తేలినారు.

కుందెన = కుదురు
సంగడి = గుంపుగా
అరవిరి బాగులన్ = సగము విచ్చిన పూల వంటి నిండు సొబగులతో
ఒల్లన = మెల్లగా
కోనేటప్పని = స్వామి పుష్కరిణీ తీర వాసి యగు శ్రీనివాసుని

Wednesday 27 August 2008

డోలాయాం

డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం ..డోలా..

మీన కూర్మ వరాహా మృగపతి అవతారా
దానవారే గుణశౌరే ధరణిధర మరుజనక ..డోలా..

వామనరామ రామ వరకృష్ణ అవతారా
శ్యామలాంగా రంగ రంగ సామజవరద మురహరణ ..డోలా..

దారుణ బుద్ధ కలికి దశవిధ అవతారా
శీరపాణే గోఅస మాణే శ్రీవేంకటగిరి కూటనిలయ ..డోలా..


కీర్తనను వినండి [Please open the link in a new Tab to stay in this page ]

క్షీరాబ్ధి కన్యకకు

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయ కు ను నీరాజనం

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం


చరణకిసలయములకు సకియలంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు నతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం

పగటు శ్రీ వేంకటేశు పట్టపురాణియై
నెగడు సతి కళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ జక్కదనములకెల్ల
నిగుడు నిజశోభనపు నీరాజనం


కీర్తనను వినండి
[ Please open the link in a new Tab to stay in this page ]

నల్లని మేని నగవు జూపుల వాడు

నల్లని మేని నగవు జూపుల వాడు
తెల్లని కన్నుల దేవుడు

1) బిరుసైన దనుజుల పీచమణచినట్టి
తిరుపుగైదువుతోడి దేవుడు
చరిబడ్డ జగమెల్ల జక్కజాయకు దెచ్చి
తెరవు చూపినట్టి దేవుడు

2) నీట గలిసినట్టి నిండిన చదువులు
తేటపరచినట్టి దేవుడు
పాటి మాలినట్టి ప్రాణుల దురితపు
తీట వాపినట్టి దేవుడు

3) గురుతు వెట్టగ రాని గుణముల నెలకొన్న
తిరు వేంకటాద్రి పై దేవుడు
తిరముగ ధ్రువునికి దివ్యపదంబిచ్చి
తెరచి రాజన్నట్టి దేవుడు



కీర్తనను వినండి [Open the link in a new Tab to stay in this page]

Tuesday 26 August 2008

దుడుకు గల

పల్లవి : దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా ఎంతో II దు II
అను పల్లవి : కడుదుర్విషయాకృష్టుడై గడియగడియకు నిండారు II దు II
శ్రీవనితా హృత్కుముదాబ్జ అవాజ్మానసగోచర II దు II
సకల భూతములందు నీవైయుండగా మది లేక బోయిన II దు II
చిఱుత ప్రాయములనాడే, భజనామృత రసవిహీనకుతర్కుడైన II దు II
పరధనముల కొఱకు నొరుల మది
కరగబలికి కడుపునింప తిరిగినట్టి II దు II
తన మదిని భువిని సౌఖ్యపు జీ -
వనమె యనుచు సదా దినములు గడిపే II దు II

చ : తెలియని నటవిట క్షుద్రులు వనితలు
స్వవశమవుట కుపదిశించి
సంతసిల్లి స్వరలయంబు లెఱుంగకను
శిలాత్ములై సుభక్తులకు సమానమగు II దు II


చ : దృష్టికి సారంబగు లలనా సదనార్భక
సేవామిత ధనాదులను,
దేవాదిదేవ నెరనమ్మితి గాకను
నీ పదాబ్జ భజనంబు మఱచిన II దు II

చ : చక్కని ముఖ కమలంబును సదా
నా మదిలో స్మరణ లేకనే
దుర్మదాంధ జనులకోరి పరి -
తాపముల చేదగితి నొగిలి
దుర్విషయ దురాసలను రోయలేక
సతత మపరాధినయి, చపలచిత్తుడైన II దు II

చ : మానవతను దుర్లభమనుచు నెంచి,
పరమానంద మొందలేక
మదమత్సర కామలోభ మోహులకు
దాసుడయి మోసబోతిగాక
మొదటి కులజుడగుచు భువిని
శూద్రుల పనులు సల్పుచుంటిని గాక,
నపరాధములను రోయ సారహీన -
మతములను సాధింప తారుమారు II దు II

చ : సతులకు కొన్నాళ్ళాస్తికై సుతులకు కొన్నాళ్ళు
ధనతతులకై తిరిగితినయ్య
త్యాగరాజాప్త ఇటువంటి II దు II

Wednesday 20 August 2008

కొలని దోపరికి గొబ్బిళ్ళో !

కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికి గొబ్బిళ్ళో

1. కొండ గొడుగుగా గోవుల గాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళో
దుండగంపు దైత్యులకెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో

2. పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున గంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో

3. దండివైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిబైడి యగు వెంకటగిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో



గొబ్బి నృత్యము - రాస క్రీడవంటి నృత్యము (గుజరాతీ గర్భా నృత్యం వంటిది)

కొలని దోపరి = కొనని దొంగ (కొలనిలో జలకాలాడే గోపికల వలువల నపహరించినవాడు

కొండ .............. శిశువు = గోవర్ధన పర్వతాన్ని కొనవ్రేల ఎత్తి గోవులను, గోపాలురను కాపాడిన బాలకృష్ణుడు

కొండుక శిశువు = చిన్ని శిశువు
తలగుండు గండడు = తల కోయు శూరుడు

పాప ...............కొపగానికిని = పాపకార్యాశక్తుడైన శిశుపాలుని శతాపరాధములు మన్నించి మితి మీరిన వానిని తన చక్రాయుధమునకు బలిచేసినవాడు

వెండిపైడి యగు వేంకటగిరి = రజతాచలం, మేరు శైలం రెండూ వెంకటగిరియే

భావము :

ఈ గొబ్బిళ్ళ పాట యదుకులతిలకుని నాయకునిగా చేసి కన్నెపిల్లలు పాడినది. గోపికలు తమ ఊహలలో ఉయ్యాలలూగిన వీర శృంగార మూర్తి అయిన వంశీ మోహనుని పారవశ్యంతో గానం చేసినారు. అన్నమయ్య ఆ గోపికలలో గోపికయై ఆడినాడు ; పాడినాడు.

కృష్ణుడు కొలనిదొంగ. జలకాలాడే గోపికల వలువలను అపహరించినవాడు. గోవర్ధనగిరిని ఎత్తి, గొడుగుగా పట్టి గోవులను, గోపాలురను కాపాడినవాడు. దుండగులైన దైత్యుల తలలు తరిగిన దిట్ట. పాపి అయిన శిశుపాలుని తల త్రుంచినవాడు. కంసుని మానసిక చిత్రవధకు గురి చేసి చంపినవాడు. దుర్మార్గులై విర్రవీగిన రాక్షసుల గుండెలకు దిగులైనవాడు. మేరు రజత శైలాలు రెండూ అయిన వేంకటశైలంలో కాపురమై నిలచినవాడు.

ఈ పల్లవాంగనల గొబ్బిపదం మన హృదయాలనే పల్లవింపచేస్తుంది.

Sunday 10 August 2008

జగదానంద కారక

పల్లవి : జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక [జగదానంద ..]
అనుపల్లవి : గగనాధిపసత్కులజ రాజ రాజేశ్వర
సుగుణాకర సరసేవ్య భవ్యదాయక సదా సకల [జగదానంద ..]

చ.1. అమర తారక నిచయ కుముదహిత పరిపూర్ణానఘ
సురసురభూజ దధిపయోధి వాసహరణ
సుందరతరవదన సుధామయవచోబృంద గోవింద
సానంద మావరాజరాప్త శుభకరానేక [జగదానంద ..]

2. నిగమనీరజామృతజ పోషకానిమిషవైరి
వార్దసమీరణ ఖరతురంగ సత్కవిహ్దలాయ
అగణిత వానరాధిప నతాంఘ్రియుగ [జగదానంద ..]

3. ఇంద్రనీలమణి సన్నిభావఘన
చంద్రసూర్య నయనాప్రమేయ వా
గీంద్రజనక సకలేశ శుభ్ర నా
గేంద్రశయన శమనవైరి సన్నుత [జగదానంద ..]

4. పాద విజిత మౌనిశాప నవ పరి
పాల వరమంత్రగ్రహణలోల
పరమశాంత చిత్త జనకజాధిప
సరోజభవ వరదాఖిల [జగదానంద ..]

5. సృష్ఠిస్థిత్యంత కారక అమిత
కామిత ఫలద అసమానగాత్ర
శచీపతిసుతాభ్దిమదహర
అనురాగ రాగరంజిత కథాసారహిత [జగదానంద ..]

6. సజ్జన మానసాబ్ధిసుధాకర
కుసుమ విమాన సురసారిపు కరాబ్జ
లాలిత చరణ అవగుణాసుర
గణమదహరణ సనాతనాజనుత [జగదానంద ..]

7. ఓంకార పజరకీర పురహర
సరోజ భవ కేశవాది రూప
వాసవ రిపు జనకాంతక కలాధర
కలాధపరాప్త ఘృణాకర
శరణాగత జనపాలన సుమనోరమణ
నిర్వికార నిగమ సారతర [జగదానంద ..]

8. కరధృత శరజాలాసుర మదాపహరణావనీసుర సురానవ కవీన బిలజ మౌనికృత చరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజ సన్నుత [జగదానంద ..]

9. పురాణపురుష స్వవరాత్మజాశ్రిత
పరాధీన ఖరవిరాధరావణ
వివారణ అనఘ పరాశర్ మనో -
హరావికృత త్యాగరాజసన్నుత [జగదానంద ..]

10. అగణితగుణ కనక చేల సాలవిదళన
అరుణాభవ సమానచరణ
అపారమహిమాధ్బుత సుకవిజన
హృత్సదన సురమునిగణ విహిత
కలశనీరనిధిజారమణ పాపగజనృసింహ
వరత్యాగ రాజాదినుత [జగదానంద ..]





కీర్తనను వినండి.... Please open the Link in a new Tab to stay in this page.

Thursday 7 August 2008

ఏమొకో చిగురుటధరమున

ఏమొకో చిగురుటధరమున యెడనెడ గస్తురి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా

1.కలికి చకోరాక్షికి గడకన్నులు కెంపై తోచిన
చెలువం బిప్పుడిదేమో - చింతింపరె చెలులు
నలువున బ్రాణేశ్వరుపై - నాటిన యా కొనచూపులు
నిలువున బెరుకఘ నంటిన - నెత్తురు కాదు గదా

2. పడతికి చనుగవ మెఱుగులు - పై పై పయ్యెద వెలుపల
కడుమించిన విధమేమో - కనుగొనరే చెలులు
ఉడుగని వేడుకతో బ్రియుడొత్తిన నఖశశిరేఖలు
వెడలగ వేసవి కాలపు - వెన్నెల కాదు గదా

3. ముద్దియ చెక్కుల కెలకుల - ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగులివేవో - వూహింపరె చెలులు
గద్దరి తిరువేంకటపతి - కామినివదనాంబుజమున
అద్దిన సురతపుజెమటల - అందము కాదు గదా


భావము :

అప్ప్పుడే కేళీమందిరము వెడలి వచ్చిన నాయికను చెలికత్తెలు పట్టుకొని పరాచికాలాడుట పదవస్తువు. ఆ నాయిక కనుగొనల అరుణిమ, పయ్యెదచెరగు దాటిన చనుగవ మెరుగులు, చెక్కిళ్ళ జారిన 'ముత్యాల జాలరుల వంటి చెమట బిందువులు - వీనిని చెలులు చింతించి, కనుగొని, ఊహించి, తెలుసుకొనవలసిన అవసరం ఏర్పడింది. భామిని చిగురుటధరం మీద నిండిన కస్తూరికి కారణాలు వెదికితే మిగిలినవన్నీ స్పష్టంగా బోధపడేవే !

ఆ పల్లవాధర అధరం మీద అక్కడక్కడ కస్తూరి నిండినది. అది భామ తన విభునకు వ్రాసిన పత్రిక యట. కలికి కనుగొనలు ఎర్రవారినవి. అవి వింత అందాన్ని సంతరించుకొన్నవి. సతి పతిపై నాటిన కొన చూపులను నిలువుగ పెరికినప్పుడు అంటిన నెత్తురట. పడతికి చనుగవ మెరుగులు పయ్యెదచెరగు మించి వ్యాపించినవి. వేడుకతో ప్రియుడు తనమగువచనుగవపై ఒత్తిన నఖశశిరేఖలు వెదజల్లిన వేశవికాలపు వెన్నెలలట. ఆ ముద్దియచెంపల కిరువైపుల ముత్యాలజాలరుల ఆభరణాలు అమరినట్లైనది. అవి తిరువేంకటపతి కామినిని కౌగిట చేర్చి అద్దిన సురతపు వేళల చెమటల అందమట.

* * *


చిగురుటధరమున = చివురు వలె ఎర్రనైన మృదువైన పెదవియందు

కలికి = మనోజ్ఞమైన స్త్రీ

చకోరాక్షి = చకోరం (గబ్బిలం.. ఎర్రని కళ్ళు) వంటి కనులు కలది.

కెంపై = ఎర్రని

చెలువము = సౌందర్యము

సలుపునన్ = అందంగా, సమర్ధవంతంగా

ఉడుగని = తగ్గని

ముత్యపు జల్లుల చేర్పులు = ముత్యాల జాలరులతో ఏర్పడిన ఆభరణం (ఆడవాళ్ళు చెంపలపై వేలడుతున్నట్టు వేసుకునే జుంకీల వంటివి)

ఒద్దికలాగులు = అనుకూలమైన విధాలు

గద్దరి = దిట్టదనము గల


ఎమొకో... కాదుకదా = రాత్రి నాయికా నాయకులకు సమాగమైనది. ప్రియుడు ప్రియురాలి అధరాలలొ దంతక్స్యతాలు చేసినాడు కాబోలు. ఆ కసికాట్లలో కస్తూరి కప్పినది. (ఆ కస్తూరి తాంబూలంలోనిది కాబోలు) ఎర్రని మృదువైన పెదవి - అక్కడక్కడ అంటిన కస్తూరి - అది భామ విభునికి రాసిన ప్రేమలేఖ వలె ఉన్నది.

తాటాకు మీద ముషీపంకం (సిరా వంటిది)తో లేఖలు వ్రాయటం పరిపాటే. ఇది రాత్రి ప్రేయసీప్రియుల మధ్య జరిగిన ఒడంబడిక లో భామిని భర్తకు వ్రాసి ఇచ్చిన ఆమోదపత్రమైనా కావచ్చు!



కలికి .... కాదు కదా = కలికి కనుగొనల ఎర్రసెరలు సౌందర్య రేఖలే కాదు. అదృష్టరేఖలు కూడ. ఆ కనుగొనల ఎర్రదనాన్ని గూర్చి ఆలోచించి, హేతువును తెలుసుకొనవలసిన అవసరం ఏర్పడింది. ఒడుపుగా ప్రాణేస్వరుపై నాటిన తన కడగంటి చూపులను నిలువుగా లాగినందున అంటిన నెత్తురు అట. చెలువకనుగొనల అరుణిమకు కారణం తెలిసినది.


పడతికి ..... కాదుకదా = ఆ యౌవనవతి బిగిచనుగవకాంతులు పైటచెరగును దాటినవి. ప్రణయ ప్రొద్దులలో వేడుకకు కొదువ లేదు. క్షణ క్షణానికీ అతిశయమే. ప్రియుడు పడతిగురుకుచములపై నఖక్షతములను చేసినాడు. అవి గోటినొక్కుల నెలవంకలు. ఇత వికాసమునకు ఆటంకములెక్కడివి ? అవి వెన్నెలలను వెదజల్లినవి. అది మామూలు వెన్నెలైన సుఖము లేదు. అందుకే వేసవి కాలపు వెన్నెలైనది.


ముద్దియ .... కాదుకదా = ఈ ముగ్ధ చెక్కుటద్దాలలో చెమట బిందువులు వ్యాపించినవి. అవి చెంపల కిరువైపుల వేసుకొన్న ముత్యాల జాలరుల వంటి ఆభరణాలై తోచినవి. అవి సురతపు వేళల చెమట బిందువులు. తిరువేంకటపతి కౌగిట బిగించి, కామిని వదనాంబుజమున అందముగా అద్దినవి.


* * *

Please open the link in a new Tab. Listen to the song..

Tuesday 5 August 2008

శ్రీమన్నారాయణ

శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు !!

కమలాసతీ ముఖ కమల కమలహిత
కమల ప్రియ కమలేక్షణ
కమలాసనహిత గరుడగమన శ్రీ
కమలనాభ నీ పదకమలమే శరణు !!

పరమయోగిజన భాగదేయ శ్రీ
పరమపురుష పరాత్పరా
పరమాత్మా పరమాణురూప శ్రీ
తిరువేంకటగిరి దేవా శరణు !!


Monday 4 August 2008

ఒకపరికొకపరి

ఒకపరికొకపరి కొయ్యారమై
మొకమున కళలెల్ల మొలచినట్లుండే


జగదేకపతిమేన చల్లిన కర్పూరధూళి
జిగికొని నలువంక చిందగాను
మొగి చంద్రముఖి నురమున నిలిపె గాన
పొగరు వెన్నెల దిగబోసి నట్లుండే


పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టుపునుగు
కరగి ఇరుదెసల కారగాను
కరిగమన విభుడు గనుక మోహమదము
తొరగి సామాసిరి తొలకినట్లుండే


మెరయ శ్రీవేంకటేశు మేన సింగారముగాను
తరచైన సొమ్ములు ధరియించగా
మెరుగు బోడి అలమేలు మంగయు తాను
మెరుపు మేఘము గూడి మెరిసినట్లుండే


ఈ కీర్తనలో వేంకటేశ్వరుని అందాన్ని వర్ణిస్తున్నాడు కవి. అందాన్ని వర్ణించడమే కాదు, ఒక అందాన్ని మరో అందంతో పోలుస్తూ, రెండిటికీ ఒక సంబంధాన్ని ఊహించడం ఇందులో విశేషం.

కళలన్నీ మొహంలోనే మొలకెత్తినట్టుగా ఉండే ఇతన్ని, చూసిన ప్రతిసారీ ఓ కొత్త ఒయ్యారం కనిపిస్తునే ఉంటుంది!

పొరి - మిక్కిలి. మెరుగు - నునుపైన. తట్టుపునుగు - మేలిరకం పునుగు (ఒక సుగంధద్రవ్యం). మోహమదము - మోహం వల్ల పుట్టే స్వేదం. తొరగి - కారి. సామజ సిరి - ఏనుగు మదజలం. తొలకు - కురియు
నున్నని చెక్కులపై పూసిన పునుగు కరిగి రెండువైపులా కారుతోంది. అదెలా ఉందంటే, మోహంవల్ల పుట్టే చెమటలా ఉంది. ఈ ప్రభువు ఏనుగునడకలాంటి అందమైన నడక ఉన్నవాడు కాబట్టి (సామజ వర గమన), ఏనుగ వెళుతూంటే దాన్నుంచి కారే మదజలంలా ఉందిది. పునుగు నల్లగా ఉంటుంది. ఏనుగునుంచి కారే మదజలమూ నల్లగానే కనిపిస్తుంది.


తరచైన - ఘనమైన (thick). మెరుగుబోడి - మెరుపులాంటి శరీరం కలది. ఒంటిమీద ఘనమైన అలంకారాలతో మెరుస్తున్నాడు వేంకటేశుడు. పక్కనే మెరుపుతీగలాంటి అలమేలు మంగమ్మ, ఎలా ఉందంటే, మెరుపు మేఘంతో కూడి వెలిగిపోతున్నట్టుంది. వేంకటేశుడు నల్లనివాడు కదా!


Saturday 2 August 2008

ఉగ్గు వెట్టరే వోయమ్మా

ఉగ్గు వెట్టరే వోయమ్మా చెయ్యొగ్గీ నెదె శిశు వోయమ్మా

1. కడుపులోని లోకమ్ములు గదలీ - నొడలూచకురే వోయమ్మా
తొడికెడు పరుగన దొలగ దీయరే - వుడికెడి పాలివి వోయమ్మా

2. చప్పలు పట్టుక - సన్నపు బాలుని - నుప్పర మొత్తకు రోయమ్మా
అప్పుడె సకలము నదిమీనోరనె - వొప్పదు తియ్యరె వోయమ్మా

3. తొయ్యలు లిటు చేతుల నలగించక - వుయ్యలనిడరే వోయమ్మా
కొయ్య మాటలను - కొండల తిమ్మని - నొయ్యన తిట్టకు రోరమ్మా


భావము :

ఇది ఒక కన్న తల్లి ఉత్కంఠ ! ఇది ఒక భక్తుని తపన. ఈ పాటలో యశోదే అన్నమయ్యగా, అన్నమయ్యే యశోదగా కనిపిస్తారు. వాత్సల్యం రసం అయినా కాకపోయినా రసానుభూతిని కలిగించే ఈ పాటలో వాత్సల్య రసస్థాయినే అందుకొన్నది.

గోపభామినులు యశోదాకిషోరుని వదలి క్షణమైనా నిలువలేదు. ఆ బాలుని తలచి, తల లూచి, అనిర్వచనీయమైన అనుభూతినే పొందినారు. కానీ ఏమిటో ? వారికి తీరని అసంతృప్తి. పరమాత్ముని దర్శించీ తరించ లేని జీవాత్మల పరితాపం వారిది ! పరబ్రహ్మను భావించీ అనుభవించలేని ఆవేదన వారిది.

భామలు బాలుని చేరినారు. పరిసరములు గమనించకయే పరవశించి రసలోలువలైనారు. బాలుని బొమ్మ వలే ఆడించినారు. బొంగరం వలే త్రిప్పినారు. యశోద పరుగున చేరి వారిని వారించినది. చిన్ని చేతుల సాచే చిన్ని శిశువుకు ఉగ్గు పెట్టుమన్నది. ఆ ఒయ్యారి భామలు బాలుని చేతులలోనికి తీసుకొని కదపసాగినారు.

'అయ్యో! కడుపులోని లోకాలు కదిలిపోతాయి జాగ్రత్త !' అని యశోద వారిని హెచ్చరించినది.

వేడిపాలను ఎక్కడ తన బాలుడు తాకి ఒలకపోసుకొంటాడో అని బాలుని తొలగదీయుడని వాపోయింది. కాంతలు బాలుని జబ్బలు పట్టుకొని పైకెత్తి బంతులాడ సాగినారు. 'మీరు వానిని పైకెత్తితే బాలుడు సృష్టినంతా చప్పరించి వేస్తాడు సుమా! అన్నది ఆ తల్లి. మగువలు ముద్దు కృష్నుని నలపసాగినారు. కన్నతల్లి సహనం చచ్చిపోయినది. 'ఎందుకమ్మ, చిన్ని బాలుని అంతగా నలపడం ; ఉయ్యాలలో ఉంచండీ అని మందలించినది. వారేవో దుబారాగా మాట్లాడినారు బాలుని గురించి.


'నా బాలుడంటే ఎవరనుకొన్నారే ? సాక్షాత్తూ ఏడుకొండలవాడే : మీ కొయ్య మాటలు మాని వచ్చిన దార్న వెళ్ళండి ' అని కసిరి పంపింది.


భక్తుని హృదయం విచిత్రమైనది. బాలుడంటూనే పరతత్వాన్ని భోధించినాడు.

* * *
చెయ్యొగ్గీనిదె = చెయ్యి చాచెడినిదె, చెయ్యి అగ్గుట

తొడికెడి = తాకెడి, పట్టెడి

సరగున = శీఘ్రమున

చప్పలు = జబ్బలు

ఉప్పరము = ఆకాశం

కొయ్య మాటలు = తేలిక మాటలు

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger