Monday 15 December 2008

విష్ణు సహస్ర నామం శ్లో - 8




శ్లో|| ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్టః ప్రజాపతిః
హిరణ్య గర్భో భూగర్బో మాధవో మధుసూదనః

1. ఈశానః = అందరికన్నా గొప్పవాడైన పరమాత్మ
2. ప్రాణదః = ప్రాణములు ఇచ్చువాడు
3. ప్రాణః = ప్రాణము
4. జేష్ఠః = అందరికన్నా పెద్ద వాడు
5. శ్రేష్టః = అత్యుత్తమమయినవాడు
6. ప్రజాపతిః = పుట్టుకకు కారణమయినవాడు
7. హిరణ్యగర్భః = బంగారపు గ్రుడ్డు
8. భూ గర్భః = భూమి యొక్క కేంద్రము
9. మాధవః = లక్ష్మీదేవి భర్త
10. మధుసూదనః = మధువు అను రాక్షసుని చంపినవాడు

భావము :

పరమాత్మను మిక్కిలి గొప్పవానిగను, ప్రాణము నిచ్చువానిగను మరియు ప్రాణము గను, అందరికన్నా పెద్దవానిగను, ఉత్తమమయిన వానిగను, పుట్టుకకు కారణమయినవాడుగను, బంగారపు గుడ్డు గను, భూమికి కేంద్రము మరియు గర్భము అయినవానిగను, లక్ష్మీదేవి కి భర్త గను, మధువు అను రాక్షసుని సంహరించినవానిగను, ధ్యానము చేయవలెను.

శ్రీవేంకటేశస్తోత్రం



కమలాకుచ చూచుక కుంకుమతో
నియతారుణితాతుల నీలతనో
కమలాయతలోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే

సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ప్రముఖాఖిలదైవతమౌళిమణే
శరణాగతవత్సల సారనిధే
పరిపాలయమాం వృషశైలపతే

అతివేలతయా తవ దుర్విషహై
రనువేలకృతై రపరాధశతైః
భరితం త్వరితం వృషశైలపతే
పరయా కృపయా పరిపాహి హరే

అధివేంకటశైల ముదారమతే
ర్జనతాభిమతాధికదానరతాత్
పరదేవతయా గదితాన్నిగమైః
కమలాదయితాన్న పరం కలయే

కలవేణురవావశ గోపవధూ
శతకోటివృతాత్స్మర కోటి సమాత్
ప్రతివల్లవికాభిమతాత్సుఖదాత్
వసుదేవసుతాన్న పరం కలయే

అభిరామగుణాకర దాశరథే
జగదేకధనుర్ధర ధీరమతే
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయాజలధే

అవనీతనయా కమనీయకరం
రజనీకరచారుముఖాంబురుహం
రజనీచరరాజ తమో మిహిరం
మహనీయమహం రఘురామమయే

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయ మమోఘశరం
అపహాయ రఘోద్వహ మన్య మహం
న కథంచన కంచన జాతు భజే

వినా వేంకటేశం న నాథో న నాథః
సతా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ

అహం దూరతస్తే పదాంభోజయుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ

అజ్ఞానినా మయా దోషానశేషాన్విహితాన్ హరే
క్సమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైలశిఖామణే

Tuesday 2 December 2008

కులుకక నడవరో

Get this widget | Track details | eSnips Social DNA



కులుకక నడవరో - కొమ్మలాలా | జలజల రాలీని - జాజులు మాయమ్మకు

ఒయ్యనే మేను గదలీ - నొప్పుగా నడవరో | గయ్యాళి శ్రీ పాదతాకు - కాంతలాలా
పయ్యెద చెఱగు జారీ - భారపుగుబ్బల మీద | అయ్యో చెమరించె మాయమ్మకు నెన్నుదురు

చల్లెడి గందవొడి మై జారీనిలువరో | పల్లకి పట్టిన ముద్దు - బణతులాలా
మెల్లనైన కుందనపు - ముత్యాల కుచ్చులదర | గల్లనుచు గంకణాలు - గదలీ మాయమ్మకు

జమళిముత్యాల తోడి - చమ్మాళిగలిడరో | రమణికి మణుల నారతులెత్తరో
అమరించి కౌగిట - నలమేలుమంగ నిదె | సమగూడె వేంకటేశ్వరుడు మాయమ్మకు

భావము :

(వేంకటేశ్వర స్వామి పెండ్లి తిరునాళ్ళు మన యన్నమాచార్యుడే తొలుత వెలయించినవాడుగా తోచుచున్నాడు. ఆగమ శాస్త్రమున, వివాహొత్సవము చేయుచున్న మాన్యుడే కన్యాదాత గా వర్తిల్లగు నని కలదట. వేంకటేశ్వరుని అల్లునిగా పొందిన అన్నమయ్య నిజముగా ధన్యుడు. అలమేలుమంగ అన్నమయ్య కన్నుల వెలుగు. తన ఒడలి బడలికలు తీర్చి కడుపార ప్రసాదాన్నములు పెట్టి హృదయంలో గానకవితానుధారసధారలు కురిపించిన అమృతమయి అలమేలుమంగను అన్నముడు మరచుటెట్లు ? అలమేలు మంగను వాక్ప్రసూనాలతో అర్చించి, ఈ భక్తుడు శతకమాలికను సమర్పించినాడు)

ఈ పాటలో అన్నమయ్య అలమేలుమంగను నవవధువుగా సింగారించి, పల్లకిలో కళ్యాణ వేదిక కు తరలించినట్లు భావించవచ్చు.

కొత్త పెళ్ళికూతురు పల్లకీ లో కూర్చున్నది. కుసుమకోమలి కూర్చున్న పల్లకీని బిరుసు బోయీలు మోయుటను ఈ మృదు హృదయుడు సహింపలేకపోయినాడు కాబోలు ! పల్లకీ మోతకు ముద్దు పణతులను నియోగించినాడు. వాళ్ళు మంగమ్మ పాదదాసీలు. పల్లకీ కళ్యాణవేదిక వైపు సాగింది. పల్లకీపట్టిన మిసిమిగత్తెలు విసవిస నడచినారు. పల్లకీ కుదుపులకు కలిమిజవరాలు కంపించిపోయినది. అమె నెరులు చెదరినవి - విరులు జలజల రాలినవి. రాలిన జాజులను చూచిన అన్నమయ్య శరీరమే జలదరించినది. ఆమదమరాళగమనలను హెచ్చరించినాడు. ఓ కొమ్మలాల ! గయ్యాళులాల ! కులుకక నడవండి. మాచిన్నితల్లి మేను కదలీని, పయ్యెద చెరగు జారీని, భారపుగుబ్బలు బయటపడినవి. నుదురు చెమరించినది.'

మదవతులు ముందుకు కదలినారు. ఆ గజగమనలకు గమనవిలాసాలు తప్పలేదు. పల్లకీ కుదింపులూ తగ్గలేదు. అన్నమయ్య వాళ్ళను నిలిపినాడు. మృదువుగా మందలించినాడు. 'ఓ ముద్దుగుమంలాలారా ! కొంచెం నెమ్మదిగా నడవండే. అటు చూడండి నా బంగారుతల్లి పాపటలో చల్లిన గందవొడి శరీరమంతా జారినది. ధరించిన ముద్దుల ముత్యాల కుచ్చులదరినవి. కంకణాలు కదలి కిసలయపాణి ఎంత కందిపోయిందో ! - ఆ భామలు ముసిముసి నగవులతో ముందుకు సాగినారు. ఈ కన్యాదాత ఆరాటం చెప్పనలవి కాదు. ఇందిరా సుందరాంగికి ముత్యాల పావుకోళ్ళు పెట్టరో ! రమణికి మణుల నారతులెత్తరో - అని చెలికత్తెలను పురమాయించినాడు.

అలమేలుమంగా శ్రీనివాసుల కళ్యాణం అంగరంగవైభవముగా జరిపించినాడు. శేషగిరీశ్వరుని కాళ్ళు కడిగి, కన్యాదానం చేసినాడు. వేంకటశైలవల్లభుడు మంగమ్మను బిగికౌగిట చేర్చినాడు. ఈ మహాభక్తుని కన్నులు ఆనందంతో ఆర్ద్రమయినవి.

కొమ్మ = స్త్రీ
జాజులు = జాజి పూలు
గయ్యాళి = ధిక్కరించి మాట్లాడే స్వభావం గల స్త్రీ
శ్రీపాదతాకు కాంతలు = లక్ష్మీదేవి పాదాలు తాకే అధికారం గల ఆడవాళ్ళు, పాదదాసీలు
గందవొడి = గందపొడి ; కొన్ని సుగంధద్రవ్యాలు కలిపి చేసిన పొడి, మిశ్రము, స్త్రీలు దీనిని పాపటలో చల్లుకొంటారు
జమళి = జంట
చమ్మాళిగలు = సమ్మాళిగలు, పాదరక్షలు

Monday 1 December 2008

విష్ణు సహస్ర నామం శ్లో 7



శ్లో|| అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్ధనః
ప్రభూత స్త్రి కకుబ్ధామ పవిత్రం మంగళం పరం ||


1. అగ్రాహ్యః = తెలుసుకొన వీలు లేనివాడు
2. శాశ్వతః = శాశ్వతమయినవాడు
3. కృష్ణః = చీకటి యే తన రూపమైనవాడు
4. లోహితాక్షః = ఎఱ్ఱని కన్నులు కలవాడు
5. ప్రతర్ధనః = మార్పు లేక నిలుచువాడు
6. ప్రభూతః = చక్కని రూపముగా ఏర్పడినవాడు
7. త్రికకుప్ = మూడుపేర్లతో తెలియబడువాడు
8. ధామ = వెలుగు మార్గముగా గలవాడు
9. పవిత్రం = నిర్మలమయినవాడు
10. మంగళం = శుభ్రమయినవాడు
11. పరం = పరమమయినవాడు, అత్యుత్తమమయినవాడు

భావము :


పరమాత్మ మన గ్రహణమునకు అతీతమయిన వానిగా, చీకటికవ్వల (ఆవల) నున్నవానిగా ధ్యానము చేయవలెను. ఆయన ఎఱ్ఱని కన్నులు కలిగి, మార్పులకు అతీతముగా నుండువాడు. ఆయన చక్కని రూపముగా ఏర్పడి, మూడు నామములు కలిగినవాడు. వెలుగే తన మార్గమయినవాడు మరియు నిర్మలమయినవాడు, అత్యుత్తమ మంగళ రూపము కలవాడు.

విష్ణు సహస్ర నామం శ్లో 6



శ్లో|| అప్రమేయో హృషీకేశః పద్మనాభో మర ప్రభుః
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్టః ధుర్వః ||


1. అప్రమేయః = కొలతలకందని వాడు.
2. హృషీకేశః = హృదయమున కధిపతియైనవాడు
3. పద్మనాభః = నాభియందు పద్మము కలిగినవాడు
4. అమర ప్రభుః = దేవతలకు ప్రభువైనవాడు
5. విశ్వకర్మా = విశ్వమును నిర్మాణము చేయువాడు
6. మనుః = మానవ జాతికి అధిపతియైన మనువు
7. త్వష్టా = రూపములను చెక్కువాడు
8. స్థవిష్ఠః = స్థిరమైన వానిలో మిక్కిలి స్థిరమయినవాడు
9. స్థవిరః = వృద్ధుడు
10. ధృవః = ధ్రువము లేక ఇరుసు వంటివాడు

భావము :

భగవంతుడు కొలతల కతీతమయిన హృదూయమున కధిపతిగా పద్మమే తన నాభిగా తెలియబడువాడు. ఆయన దేవతలకు ప్రభువు. విశ్వమును నిర్మాణము చేసినవాడు, మానవజాతికి అధిపతియైనవాడు, సకల రూపములను చెక్కువాడు, అందరికన్నా, ఎక్కువ వయసు కలవాడు. తానే ధ్రువమై స్థిరముగానున్నవాడు.

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger