Wednesday 1 April 2009

విష్ణు సహస్ర నామం శ్లో || 18

వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||

1. వేద్యః = తెలియబడవలసినవాడు
2. వైద్యః = వైద్యుడు
3. సదాయోగీ = నిరంతరము యోగిగానుండువాడు
4. వీరహ = వీరులను సంహరించువాడు (యుద్ధమందు)
5. మాధవః = లక్ష్మికి పతియైనవాడు
6. మధుః = తేనెవంటివాడు
7. అతీంద్రియః = ఇంద్రియములను దాటినవాడు, ఇంద్రియములకు గోచరించనివాడు
8. మహామాయః = అన్ని మాయలకు అతీతమయిన మాయ కలవాడు లేక మాయలన్నిటికి కారణమయినవాడు
9. మహోత్సాహః = గొప్ప ఉత్సాహము కలవాడు
10. మహాబలః = గొప్ప బలము గలవాడు

భావము : పరమాత్మను తెలియబడువానిగా, వైద్యునిగా, యోగిగా, వీరునిగా మరియూ వీరులను జయించువానిగా, లక్ష్మీదేవి భర్తగా, మధురమైనవానిగా, ఇంద్రియములకు అతీతమయినవానిగా, మాయల కతీతమయినవానిగా, గొప్ప ఉత్సాహవంతునిగా, గొప్ప బలసంపన్నునిగా, ధ్యానము చేయుము.

విష్ణు సహస్ర నామం శ్లో || 17


ఉపేంద్రో వామనః ప్రాంశు రమోఘశ్శుచి రూర్జితః
అతీంద్ర స్సంగ్రహస్సర్గో ధృతాత్మా నియమో యమః ||

1. ఉపేంద్రః = ఇంద్రునికి తమ్ముడైనవాడు
2. వామనః = పొట్టివాడు
3. ప్రాంశుః = పొడవైనవాడు
4. అమోఘః = వ్యర్ధము కానివాడు
5. శుచిః = నిర్మలమయినవాడు
6. ఊర్జితః = బలమయినవాడు
7. అతీంద్రః = ఇంద్రుని మించినవాడు
8. సంగ్రహః = గ్రహించుట యందు చక్కని సామర్ధ్యము కలవాడు
9. సర్గః = సృష్టి చేయువాడు
10. ధృతాత్మా = ఆత్మను ధరించినవాడు
11. నియమః = నియమింపబడినవాడు
12. యమః = క్రమశిక్షణ గలవాడు

భావము :

పరమాత్మను ఇంద్రుని సోదరునిగను, పొట్టివానిగను, ఉన్నతునిగను, ఇంద్రుని అతిక్రమించువానిగను, చక్కని గ్రహణము కలవానిగను, సృష్టియందలి జీవుని ధరించినవానిగను, నియమము మరియు యమము అనునవి తానేయైనవానిగను, ధ్యానము చేయవలయును.

విష్ణు సహస్ర నామం శ్లో || 16


బ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః
అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః ||

1. బ్రాజిష్ణుః = దీప్తిమంతుడు
2. భోజనం = భోజనము, ఆహారము
3. భోక్తా = భుజించువాడు
4. సహిష్ణుః = సహనము కలవాడు
5. జగదాదిజః = సృష్టి మొట్టమొదట పుట్టినవాడు
6. అనఘః = పాపము లేనివాడు
7. విజయః = విజయము
8. జేతా = జయించినవాడు
9. విశ్వయోనిః = విశ్వమే పుట్టుక స్థానము కలవాడు
10. పునర్వసుః = కోరినపుడు సంపదలు కలిగించువాడు

భావము :

భగవంతుని దీప్తిమంతునిగను, జీవుల ఆహారము తానేఐనవానిగను, జీవుల ద్వారా ఆహారము స్వీకరించువానిగను, సహనమే తన రూపమయినవానిగను, ప్రపంచమునకు మొట్టమొదట పుట్టినవానిగను, జయించిన వానిగను, విశ్వమునకు పుట్టుక తానే అయినవానిగను, ధ్యానము చేయవలెను.

విష్ణు సహస్ర నామం శ్లో || 15


లోకాధ్యక్షః సురాధ్యక్షొ ధర్మాధ్యక్షః కృతాకృతః
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రః చతుర్భుజః ||

1. లోకాధ్యక్షః = లోకములను అధిష్టించి యున్నవాడు
2. సురాధ్యక్షః = దేవతలకు అధ్యక్షుడయినవాడు
3. ధర్మాధ్యక్షః = ధర్మమునకు పాలకుడైనవాడు
4. కృతాకృతః = సాధింపబడినది మరియు సాధింపబడనిది
5. చతురాత్మా = నాలుగు విధములుగా వ్యక్తమగువాడు
6. చతుర్వ్యూహః = నాలుగు వ్యూహములు కలవాడు
7. చతుర్దంష్ట్రః = నాలుగు కోరలు కలవాడు
8. చతుర్భుజః = నాలుగు భుజములు కలవాడు

భావము : పరమాత్మను లోకములకు అధ్యక్షునిగను, దేవతలకు అధిపతిగను, ధర్మనునకు నిర్వాహకునిగను, సాధింపబడినది మరియు సాధింపబడవలసినదిగాను, నాలుగు స్థితులుగా వ్యక్తమగువానిగను, నాలుగు వ్యూహములుగా తెలియబడువానిగను, నాలుగు కోరలు గలవానిగను, నాలుగు భుజములు గలవానిగను ధ్యానము చేయుము.

విష్ణు సహస్ర నామం శ్లో || 14

సర్వగస్సర్వ విద్భాను ర్విష్వక్సేనో జనార్ధనః
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేద విత్కవిః ||

1. సర్వగః = అంతటనూ వ్యాపించి యున్నవాడు
2. సర్వవిత్ = సమస్తమూ తెలిసినవాడు
3. భానుః = సూర్యునివలె ప్రకాశించువాడు
4. జనార్ధనః = జనులను కాలముగ భక్షించువాడు
5. వేదః = వేదము
6. వేదవిత్ = వేదము తెలిసినవాడు
7. అవ్యంగః = అవయవలోపము లేనివాడు
8. వేదాంగః = వేదాంగములకధిపతి
9. వేదవిత్ = వేదములను తెలిసినవాడు
10. కవిః = కవి


భావము : పరమాత్మను అంతట వ్యాపించియుండువానిగా, సమస్తమును తెలిసినవానిగ, కిరణములన వెలుగు తానయినవానిగా, విశ్వమందలి సేనలకు నాయకునిగా, జీవులను కాలముగ తనలోనికి స్వీకరించువానిగా, జ్ఞానము తెలియువాడుగను, వేదాంగములు తానే యగుటచే అంగలోపము లేనివానిగ పురాణములను కల్పించు కవిగ, మరియు అందలి పరమార్ధము తెలియబడువానిగను ధ్యానము చేయవలెను.

విష్ణు సహస్ర నామం శ్లో || 13


శ్లో || రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః
అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః ||

1. రుద్రః = రుద్రుడను దేవత, చందస్సుకు అధిదేవత
2. బహుశిరాః = అనేక శిరములు కలవాడు
3. బభ్రుః = అనేకముగా విస్తరించిన రూపములే తనరూపమయినవాడు
4. విశ్వయోనిః = విశ్వమే తన పుట్టుక స్థానమయినవాడు
5. శుచిశ్రవాః = వినుటయందు నిర్మలత కలిగినవాడు
6. అమృతః = మృతి లేనివాడు
7. శాశ్వతః = శాశ్వతమైనవాడు
8. స్థాణుః = కదలికలేనివాడు
9. వరారోహః = ఉత్తమమయిన జన్మ కలవాడు,
10. మహాతపాః = గొప్పతపస్సు కలిగినవాడు లేక తపస్సే తానైనవాడు.

భావము :

పరమాత్మను చందస్సులకధిదేవతగా, అనేక శిరములు కలిగినవానిగా, సృష్టియందలి వర్ణములన్నియు తన రూపమయినవానిగా, విశ్వమునకు పుట్టుకయైనవానిగ, మరియు విశ్వమునందు పుట్టుచున్నవానిగ, మృత్యువులేనివానిగ, శాశ్వతునిగ, చైతన్యము లేనివానిగ, ఉత్తమమయిన పుట్టుక కలవానిగ, గొప్ప తపస్సు చేయువానిగ మరియు తపస్సే తానయిన వానిగా ధ్యానము చేయవలెను.

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger